భోపాల్: ఇంట్లోని పురుషుడిని బంధించి అతని భార్యపై, కూతురిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలో బాధితులు నివసిస్తుంటారు.

ఇంట్లోకి దుండగులు చొరపడి దుండగులు మహిళ భర్తను బంధించారు. ఆ తర్వాత ఆమెను, 12 ఏళ్ల కూతురిని ఎత్తుకెళ్లి పక్కన ఉన్న పొలాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. 

ఆరుగురు దుండగులు శుక్రవారంనాడు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితులను బుర్హాన్ పూర్ ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది. బాధితురాలి భర్త కూలీ పనులు చేస్తుంటాడు. కుటుంబం ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. 

భుశవాల్ నుంచి ఏడాది క్రితం ఇక్కడికివచ్చి వారు స్టోన్ క్రిషింగ్ యూనిట్ లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. నిద్రిస్తున్న తమ గుడిసెలోకి దుండగులు ప్రవేశించి, తన భార్యను, కూతురుని తీసుకుని వెళ్తున్నప్పుడు వ్యక్తి సాయం కోసం కేకలు వేశారు. అయితే ఇరుగుపొరుగు వారు సాయం కోసం వచ్చారు. వారిని కూడా దుండగులు బంధించారు.