అత్యాచార బాధితురాలి పేరు, ఫొటో షేర్‌ చేస్తే శిక్ష ఏమిటో తెలుసా? భారతీయ న్యాయ సంహిత ఏం చెబుతోంది?

కోల్‌కతా అత్యాచార, హత్య ఘటనకు సంబంధించిన బాధితురాలి వివరాలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని వెంటనే తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యాచార బాధితురాలి వివరాలు బహిర్గతం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసుకోండి..

 

Legal Consequences of Revealing Rape Victim's Identity in India GVR

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ & హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల రెసిడెంట్‌ డాక్టర్‌ పేరు, ఫొటోలు, వీడియోలు, ఇతర అన్ని వివరాలను తొలగించాలని అన్ని సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సుమోటోగా విచారణ సందర్భంగా భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా బాధిత మహిళ గుర్తింపు, ఆమె మృతదేహం ఫొటోలను పబ్లిష్‌/టెలికాస్ట్‌ చేయడాన్ని తప్పుపట్టింది.  ఈ సందర్భంగా అన్ని సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కోల్‌కతా హత్యాచార ఘటనకు సంబంధించిన బాధితురాలి ఫొటోలు, వీడియోలు తీసివేయాలని స్పష్టంచేసింది. బాధితురాలి పేరును విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రచురించడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తిని, తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 

అత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసిన వారికి శిక్షకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో ఏం ఉందంటే..?

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 72 ప్రకారం, సెక్షన్‌ 64 లేదా, సెక్షన్‌ 65 లేదాసెక్షన్‌ 66 లేదా సెక్షన్‌ 67, సెక్షన్‌ 68 కింద నేరం చేసిన వ్యక్తికి సంబంధించిన గుర్తింపును తెలియజేసే పేరు లేదా ఏదైనా సమాచారాన్ని ఎవరు ముద్రించినా, ప్రచురించినా.. లేదా.. సెక్షన్‌ 69, సెక్షన్‌ 70, సెక్షన్‌ 71 ప్రకారం బాధితురాలి వివరాలు వెల్లడించినా రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. అలాగే, కోర్టు జరిమానా విధించే అవకాశం ఉంది. 

భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 64 నుంచి 71 వరకు మహిళలు, మైనర్లపై అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించినవి. ఈ సెక్షన్ల ప్రకారం, దేశంలో ఎవరైనా అత్యాచార బాధితురాలి వివరాలు, గుర్తింపు బహిర్గతం చేస్తే శిక్షార్హులు. రెండేళ్ల వరకు జైలు శిక్షకు అర్హులు.  

మినహాయింపులు ఇవే...

భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 72 కొన్ని మినహాయింపులను ఇస్తోంది. అవేంటంటే.. 

పోలీసు స్టేషన్‌ ఇంచార్జి అధికారి లేదా పోలీసు అధికారి రాతపూర్వకమైన ఉత్తర్వు ద్వారా నేరంపై దర్యాప్తు చేస్తున్న అధికారి దర్యాప్తుకు సంబంధించిన ప్రయోజనాల కోసం వివరాలు వెల్లడిస్తే సెక్షన్‌ 72లోని పార్ట్‌ 2 ప్రకారం మినహాయింపు ఉంటుంది. బాధితురాలి ద్వారా రాతపూర్వకంగా వివరాలు వెల్లడిస్తే మినహాయింపు వర్తిస్తుంది. బాధిరాలు చనిపోయినా, మైనర్‌ అయినా, తెలివి తక్కువ వ్యక్తి అయినా వారి తరఫు బంధువుల ద్వారా రాతపూర్వకంగా అధికారంతో సమాచారం అందిస్తే శిక్ష నుంచి మినహాయింపు  ఉంటుంది. 

బాధితురాలి గుర్తింపును కోర్టులు వెల్లడించవచ్చా?

బాధితుల వివరాల గోప్యత విషయంలో కోర్టులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి అత్యాచార కేసుల్లో బాధితుల వివరాలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అందిస్తోంది. బాధితులకు సంబంధించి వివరాలను కేసుల్లో ఐడింటిటీని దాచేందుకు 'ఎక్స్‌' లేదా ఇతర సంక్షిప్త పదాలను ఉపయోగించాలని ఇప్పటికే స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 72 (భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 228ఎ) ప్రకారం అత్యాచార బాధితుల గుర్తింపు లేదా గుర్తింపును బహిర్గతం చేసే ఇతర వివరాలను ప్రచురించడాన్ని నిషేధిస్తుంది. అయితే, కోర్టులో అలాంటి నిషేధం ఏమీ లేదు. 

కర్ణాటక స్టేట్‌ వర్సెస్‌ పుట్ట రాజా కేసులో బాధిరాలి పేరును కోర్టులు తన రికార్డుల్లో పేర్కొనకపోవడం సముచితమని సుప్రీం కోర్టు పేర్కొంది. లైంగిక నేరాల కేసుల్లో బాధితుల గుర్తింపు ట్రయల్‌ కోర్టుల న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో వెల్లడించవద్దని భారత అత్యున్నత న్యాయస్థానం 2021 జూలై ఆర్డర్‌లో కోరింది. బాధితురాలి గోప్యతను గౌరవించాలని పేర్కొంది. బాధితురాలి పేరును ప్రస్తావించకుండా సెషన్స్‌ జడ్జి ఇచ్చిన తీర్పుకు సుప్రీం కోర్టు మినహాయింపునిచ్చింది. 

లైంగిక వేధింపుల కేసుల్లో బాధితురాలి పేరును ఎలాంటి విచారణలోనూ ప్రస్తావించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి కేసుల విచారణలో న్యాయస్థానాలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హ్యత కేసు విచారణ సమయంలో.. సుప్రీం కోర్టు నిపున్‌ సక్సేనా తీర్పు (2018), అంతకు మునుపటి తీర్పులను ఉదహరించింది. బాధితురాలి గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లో ప్రచురించకూడదని పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios