తనను ఉంచిన వార్డు నుంచి వేరే వార్డులోకి మార్చాలంటూ అధికారులను వేడుకుంటున్నారు ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. దాణా కేసులో రాంచీలోని కారాగారంలో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూను అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

తనను ఉంచిన వార్డులో మరుగుదొడ్డి పైపు దగ్గరగా ఉందని.. తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో పాటు దోమలు కుడుతున్నాయని.. వీధి కుక్కలు మొరుగుతున్నందున నిద్ర పట్టడం లేదని.. తనను పేయింగ్ వార్డుకు తరలించాలని లాలూ రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. మధుమేహంతో పాటు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తనకు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందించాల్సి ఉంది.