భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాఘాతానికి పాల్పడ్డ నాటినుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరుదేశాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. తూర్పు లడఖ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో భారత్‌, చైనా బలగాల మధ్య సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు సమాచారం.

 అయితే.. మొదట భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటిందని.. లడఖ్‌లోని పంగోంగ్ త్సో సరస్సు ఒడ్డున కాల్పులు జరిపిందంటూ చైనా మంగళవారం ఉదయం ఆరోపించింది. భారత్ ఇరుపక్షాల మధ్య ఒప్పందాలను ఉల్లంఘించినట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

కాగా.. ఈ ఘర్షణల నేపథ్యంలో.. భారత్-చైనాల మధ్య సమావేశాలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంపై  తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. తూర్పు లడఖ్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో చాలా డీప్ కన్వర్జేషన్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాలు దీనిపై మాట్లాడుకోవాల్సిన అవసరముందన్నారు. రాజకీయంగా చర్చలు జరిగాల్సిన అసవసరం ఏర్పడిందన్నారు. 

గల్వాన్ లో ప్రమాదం జరగకముందే.. అలా జరిగే అవకాశం ఉందని తాను రాసిన ‘ ద ఇండియా వే’ అనే పుస్తకంలో రాసినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధం కొనసాగాలంటే సరిహద్దులో శాంతి ఇవ్వాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.