బిజెపితో కలిసి తండ్రిని బాధపెట్టా: విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కుమారస్వామి

Kumaraswamy trust vote in Vidhan Soudha
Highlights

శాసనసభలో కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు.

బెంగళూరు: శాసనసభలో కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఆయన శుక్రవారం సభలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. 

విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తర్వాత ఆయన మాట్లాడారు. కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదని ఆయన అన్నారు. హంగ్ అసెంబ్లీ రాష్ట్రానికి కొత్త కాదని అన్నారు.  2004లో కూడా హంగ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. సంకీర్షణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు తమకు మెజారిటీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెసుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ కుటుంబం ఎప్పుడు కూడా పదవుల కోసం పాకులాడలేదని చెప్పారు. తన తండ్రి దేవెగౌడ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. గతంలో బిజెపితో తన తండ్రినికాదని బిజెపితో కలిసి పనిచేసి బాధపెట్టానని, తన తండ్రి సెక్యులర్ భావాలు కలిగినవారని అన్నారు. తాను ఏ కులానికి, మతానికి చెందినవాడిని కానని అన్నారు. 2006లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం తన జీవితంలో మాయని మచ్చ అని అన్నారు. తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచడం బాధ కలిగించిందని అన్నారు.

శాసనసభలో కాంగ్రెసుకు 78 మంది, జెడిఎస్ కు 36 మంది, బిజెపికి 104 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. ఇతరులు ఇద్దరున్నారు. కుమారస్వామి శాసనసభ విశ్వాసం పొందాలంటే 111 మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెసు, జెడిఎస్ కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నేపథ్యంలో కుమారస్వామి సభలో తన బలాన్ని నిరూపించుకోవడం కష్టం కాదని భావిస్తున్నారు.

loader