సిఎంగా కుమారస్వామి ప్రమాణం: ప్రతిపక్ష నేతల ఐక్య ప్రదర్శన

సిఎంగా కుమారస్వామి ప్రమాణం: ప్రతిపక్ష నేతల ఐక్య ప్రదర్శన

బెంగళూరు:  కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జెడిఎస్ నేత కుమార స్వామి బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజెపి వ్యతిరేక శిబిరం మోహరించింది.

విధానసభ ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పెద్ద యెత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 

కాంగ్రెసు నేత జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కుమారస్వామి ప్రభుత్వం రేపు గురువారం శాసనసభలో బలనిరూపణ చేసుకుంటుంది. బలనిరూపణ తర్వాతనే కుమారస్వామి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. స్పీకర్ కాంగ్రెసు సభ్యుడికి ఇవ్వడానికి, డిప్యూటీ స్పీకర్ పదవి జెడిఎస్ తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. కుమారస్వామి మంత్రివర్గం 34 మంది సభ్యులతో ఏర్పడుతుంది. కాంగ్రెసుకు 22, జెడిఎస్ కు ముఖ్యమంత్రి సహా 12 మంత్రి పదవులు దక్కుతాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.

ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వచ్చారు. తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిపిఐ నేత రాజా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 

కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ప్రమాణస్వీకారానికి వచ్చారు. వారు వేదిక మీదికి రాగానే హర్షధ్వానాలు చెలరేగాయి. అర్జెడీ నాయకుడు తేజస్వి యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి రవి కూడా హాజరయ్యారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page