కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని డమ్ డమ్ రోడ్ ప్రాంతంలో ఉంటున్న 20 ఏళ్ల మహిళపై ఓ యువకుడు ఐదేళ్ల పాటు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత గత ఆదివారం ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు.

ఆ వ్యక్తిపై సింతీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో నిందితుడి తల్లిని కూడా చేర్చారు. బాధిత మహిళను బెదిరించిందనే ఆరోపణపై ఆమెను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2015, 2020 ప్రారంభం మధ్య ఇరువురు సన్నిహితంగా మెలుగుతూ శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు. యువకుడు తన ఇంట్లోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. 

ఆమెపై శారీరక హింసకు కూడా అతను పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. పెళ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి చేయడంతో అతను, అతని తల్లి ఆమెను బెదిరించారు. ఆమెతో తెగదెంపులు చేసుకుని అతను ఆమె చెల్లెను వివాహమాడాడు. 

కేసును దర్యాప్తు చేస్తామని, ఇరు కుటుంబాలకు చెందినవారి వాంగ్మూలాలు రికార్డు చేస్తామని పోలీసులు చెప్పారు. బాధిత మహిళ చెల్లె వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుంది. నిందితుడిపై రేప్, మోసం కేసులను పోలీసులు నమోదు చేశారు.