కోల్‌కతా డాక్టర్ రేప్- మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ ఆడియో
కోల్‌కతా డాక్టర్ రేప్-మర్డర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైరల్‌గా మారిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం- హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలన రేపింది. ఈ ఘటన పట్ల దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. ట్రైనీ డాక్టర్‌ని వేధింపులకు గురిచేసి హత్య చేసిన కేసులో తాజాగా ఓ మహిళా డాక్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై మొదట దాడి చేశారని, ఆపై అత్యాచారం చేశారని తెలిపారు. హత్యలో ఓ అమ్మాయి ప్రమేయం కూడా ఉందని చెప్పారు.
ఈ కుట్రలో ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ డాక్టర్, సంబంధిత విభాగాధిపతి ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో షేర్ చేసిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో, ట్రైనీ వైద్యులను లక్ష్యంగా చేసుకుని ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది సంబంధాలు నడుపుతున్నారని మహిళా డాక్టర్ ఆరోపించారు. తమ కోరిక మేరకు పని చేయాలని వైద్యులు ఒత్తిడి చేశారని, థీసిస్ సమర్పించాలని వేధించారని సదరు ఆడియోలో మహిళా డాక్టర్ పేర్కొన్నారు.
వైద్య కళాశాల సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు...
మహిళా వైద్యురాలు తన ఆడియో సందేశంలో ట్రైనీ డాక్టర్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు వివిధ సాకులతో విద్యార్థుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే థీసిస్ సమర్పించబోమని, సర్టిఫికెట్లు ఇవ్వబోమని, మెడికల్ రిజిస్ట్రేషన్ కానీయమని విద్యార్థులను బెదిరించారని ఆరోపించారు.
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ మర్డర్- రేప్ కేసులో కీలక పాత్ర పోషించిన సందీప్ ఘోష్‌కి మహిళా డాక్టర్ ప్రత్యేకంగా పేరు పెట్టారు. గ్రూప్ ఇంటర్న్‌లు, హౌస్ స్టాఫ్‌తో కూడిన సెక్స్, డ్రగ్ రాకెట్‌ను నడుపుతున్నట్లు ఆరోపించారు. హెరాయిన్, బ్రౌన్ షుగర్, లో కాస్ట్ మెడిసిన్ అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. కోట్లాది రూపాయల టెండర్లకు సంబంధించి.. అందులో ఎక్కువ భాగం పార్టీ ఫండ్‌కే వెళ్లిందని చెప్పారు.
బాధితురాలైన ట్రైనీ డాక్టర్.. మంచి విద్యార్థి అని, ఆమె థీసిస్ సమర్పించినందుకు నిరంతరం బెదిరింపులకు గురైనట్లు తెలుస్తోంది. మహిళా వైద్యురాలు ఆడియో క్లిప్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆర్‌జీ కర్ కాలేజీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. దీంతో ఆమెను చనిపోవడానికి ఆరు నెలల ముందు... డిపార్ట్‌మెంట్ హెడ్‌లు, సీనియర్ పీజీటీలు, నర్సు హెడ్‌ల సూచనల మేరకు నిరంతరం నైట్ డ్యూటీలో ఉంచి వేధించారు.’
ఆర్జీ కర్ ఘటన గురించి తనతోటి డాక్టర్ స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లు వైద్యురాలు తన ఆడియో సందేశంలో తెలిపారు. ఈ సంఘటనను తాను నమ్మలేకపోతున్నానని... పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇలాంటి దోపిడీ విధానాలు విపరీతంగా ఉన్నాయని ఆరోపించారు.
‘కోల్‌కతాలోని ఆసుపత్రుల దందాల ద్వారా వసూలైన కోట్లాది రూపాయల డబ్బు పార్టీ ఫండ్‌కి వెళ్తుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు రాష్ట్రంలోని అధికార పార్టీ దండుకుంది’ అని వైద్యురాలు ఆడియో సందేశంలో తెలిపారు. వైద్యురాలు వెల్లడించిన విషయాలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించగా, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ట్రైనీ డాక్టర్ రేప్- మర్డర్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ పారదర్శకంగా విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.