ఎందరో యువతుల జీవితాలను నాశనం చేశాడు. మాయమాటలతో లొంగదీసుకొని వారిని వ్యభిచార గృహాలకు అమ్మేశాడు. 18 ఏళ్ల తర్వాత తాజాగా హైదరాబాద్ లో పోలీసులకు చిక్కాడు. 

కేరళలోని విథుర సెక్స్‌ రాకెట్‌లో గత 18 ఏళ్లుగా పరారీలో ఉన్న ఘరానా కేటుగాడిని ఆ రాష్ట్ర పోలీసులు శంషాబాద్‌లో సోమవారం పట్టుకున్నట్టు తెలిసింది. కేరళలోని కడక్కల్‌ ప్రాంతానికి చెందిన సురేశ్‌ అలియాస్‌ షాజహాన్‌ మాయమాటలతో మహిళలను లొంగదీసుకుని వ్యభిచార గృహాలకు అమ్మేవాడు. కేరళలో ఏజెంట్ల ద్వారా ఈ దందా నడిపేవాడు. 

కేరళలోని విథుర గ్రామానికి చెందిన అజితా బేగం అనే ఏజెంట్‌ ద్వారా 1995లో ఓ బాలికను ధనవంతుల ఇంట్లో పని ఇప్పిస్తానంటూ ఎర్నాకుళానికి తరలించాడు. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు. అనేక ఏళ్లు వ్యభిచార కూపాల్లో మగ్గిన ఆ బాలికను 1996 జూలై 16న పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం ఆ బాలిక కొట్టాయంలో సురేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తర్వాత బయటకు వచ్చిన మరికొందరు బాధిత మహిళలు సురేశ్‌పై ఫిర్యాదు చేయడంతో అతనిపై 20 కేసులు నమోదైయ్యాయి. విథుర సెక్స్‌ రాకెట్లో ఇతర నిందితులు అరెస్టయినా ప్రధాన నిందితుడైన సురేశ్‌ 18 ఏళ్లు పోలీసులను చిక్కకుండా కొట్టాయం కోర్టులో 2014లో లొంగిపోయాడు. బెయిల్‌ పొందాక అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్‌ బృందం పక్కా సమాచారంతో వచ్చి శంషాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకువెళ్లారు.