కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపింది. 23ఏళ్ల ఓ యువకుడికి నిఫా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్వయంగా వెల్లడించారు. గతేడాది నిఫా వైరస్ కారణంగా కేరళలో 17మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ ప్రజలందరికీ సోకకుండా ఉండేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది.

ఎర్నాకులంలో 23 ఏండ్ల యువకుడు నిఫా వైరస్ అనుమానిత లక్షణాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ ఎమ్ కే కుట్టప్పన్ తెలిపారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అతనికి చేసిన టెస్టుల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు.

ఈ వైరస్ ఇతరులకు సోకకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డాక్టర్లు, నర్సులకు సైతం మాస్క్‌లు, సూట్‌లు అందించామని చెప్పారు. నిఫా వైరస్ బాధితుడు ఇడుక్కిలోని తొడాపుళలో కాలేజీ చదువుతున్నాడు. క్యాంప్‌లో భాగంగా ఇటీవల నాలుగు రోజుల పాటు త్రిస్సూర్‌లో ఉన్నాడు. 

కాగా..అతడితో పాటు 16 మంది అక్కడ బస చేశారు. వారిలో ఆరుగురు విద్యార్థులు అతడిని నేరుగా తాకారని, అతి దగ్గరగా ఉన్నారని త్రిస్సూర్ జిల్లా మెడికల్ అధికారులు వెల్లడించారు. వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. అటు ఆ విద్యార్థి చదివే కాలేజీ విద్యార్థులను సైతం అబ్జర్వేషన్‌లో ఉంచారు.