అమ్మా నాన్న క్షమించండి : ప్రజ్వల్ రేవణ్ణ భావోద్వేగం, వచ్చే శుక్రవారమే సిట్ ముందుకు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తన సెక్స్ కుంభకోణంపై ఎట్టకేలకు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించాడు. ఈ మేరకు అతడు విదేశాల నుండే ఓ వీడియోను విడుదల చేసాడు. ఇంతకూ ఈ వీడియో ద్వారా ప్రజ్వల్ ఏం చెప్పాడంటే...
మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఒకరిద్దరు కాదు ఎందరో మహిళలను లైంగికంగా వేధించాడని ఇతడిపై ఆరోపణలున్నాయి. అతడు మహిళలతో వున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇలా లోక్ సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ లైంగిక వేధింపుల వ్యవహారం జేడిఎస్ నే కాదు బిజెపిని కూడా ఇరకాటంలో పెట్టింది. రేవణ్ణ దేశం విడిచి పారిపోవడానికి కేంద్రం సహకరించిందనే ఆరోపణలు కూడా వున్నాయి.
అయితే ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ రేవణ్ణ మొదటిసారి లైంగిక వేధింపుల వ్యవహారంపై నోరు విప్పాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని... ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాల కోసం విదేశాలకు వచ్చినట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇండియాకు రానున్నాను... లైంగిక వేధింపుల ఆరోపణల విచారణపై ఏర్పాటుచేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ముందు హాజరవుతానని ప్రజ్వల్ రేవణ్ణ వెల్లడించాడు.
ప్రజ్వల్ రేవణ్ణ ఏం మాట్లాడాడంటే :
తన తల్లిదండ్రులు, కర్ణాటక, దేశ ప్రజలతో పాటు జేడిఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల తాను దేశం విడిచి వెళ్లలేదని... తన విదేశీ పర్యటన ముందుగానే ఖరారు అయ్యిందన్నారు. తాను ఓటుహక్కును వినియోగించుకుని విదేశాలకు వెళ్లే సమయంలో తనపై ఎలాంటి కేసులు లేవన్నారు. తాను విదేశాల్లో వుండగా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని... దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదంతా తనకు న్యూస్ ఛానల్స్ ద్వారానే తెలిపిందని ప్రజ్వల్ అన్నారు. సిట్ నోటీసులకూ తాను రిప్లై ఇచ్చానని... విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరినట్లు తెలిపాడు.
అయితే కొందరు తనపై వచ్చిన ఆరోపణలను నిజానిజాలు తేలకుండానే రాజకీయాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ సైతం తన పేరును బదనాం చేస్తున్నారని అన్నారు. తాను ఎక్కడికో పారిపోయి దాక్కున్నట్లు కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ప్రత్యర్థి పార్టీలు తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నాయని... అందులో భాగంగానే లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
తాను ఏ తప్పూ చేయలేదు... కాబట్టి తప్పకుండా సిట్ విచారణకు హాజరవుతానని ప్రజ్వల్ వెల్లడించారు. వచ్చే శుక్రవారం అంటూ మే 31న సిట్ ముందు హాజరవుతానని తెలిపాడు. న్యాయ వ్యవస్థపై తనను నమ్మకం వుందని... అక్కడే నిజానిజాలు బయటపడతాయని అన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నమోదయిన కేసులపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని అన్నాడు. ఆ దేవుడు, ప్రజలు మరియు కుటుంబసభ్యుల ఆశీస్సులు తనకు కావాలని ప్రజ్వల్ రేవణ్ణ కోరాడు.