తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఆందోళన చెందొద్దని.. తానేమీ తప్పు చేయలేదని.. అత్యాచారం, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదని ఆయన కార్యకర్తలకు తెలిపారు.

తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవని.. గురువారం రాత్రే ఈడీ నుంచి సమన్లు అందాయన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం వుందని.. చట్టాన్ని గౌరవించి ఈడీ అధికారులకు సహకరిస్తానని శివకుమార్ స్పష్టం చేశారు.

ఢిల్లీలోని డీకే నివాసంలో ఏడాది కిందట ఐటీ అధికారులు రూ. 8.59 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా నిధుల బదిలీ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆయనపై కేసు నమోదు చేసింది.

దర్యాప్తునకు హాజరవ్వాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో గురువారం రాత్రి ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.