రాంచీ: పరిహారం చెల్లించాలని అడిగినందుకు మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

జార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలోని హంటర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 ఏళ్ల వితంతువు తన కుటుంబంతో జీవిస్తోంది. ఈ నెల 7వ తేదీన బహిర్భూమికి వెళ్లిన మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల నుండి తప్పించుకొనేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను నిందితులు తీవ్రంగా హింసించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు.

బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంతకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు.  తమ ఇంటికి సమీపంలో బాధితురాలిని గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

హంటర్ గంజ్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బీహార్ లోని గయలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఆమె డిశ్చార్జ్ అయింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

తాను పెంచుకొంటున్న మేకను కొట్టినందుకు పరిహారం ఇవ్వాలని కోరినందుకు తనపై కక్షగట్టి దాడి చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు.