ముంబై: బిజెపి పార్లమెంటు సభ్యుడు రవి కిషన్ వ్యాఖ్యలపై జయా బచ్చన్ చేసిన విమర్శలను ప్రముఖ సినీ నటి, బిజెపి నేత జయప్రద తప్పు పట్టారు. రవికిషన్ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ఎంపీ జయా బచ్చన్ రాజకీయాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో బయటకు వచ్చిన మాదక ద్రవ్యాల వాడకంపై మంగళవారం పార్లమెంటులో చర్చ జరిగింది. సినీ పరిశ్రమలోని వారు కూ4డా మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని రవి కిషన్ అన్నారు 

రవికిషన్ వ్యాఖ్యలను జయాబచ్చన్ ఖండించారు. కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం సినీ పరిశ్రమను అవమానించకూడదని, నటుడై ఓ ఎంపీ పరిశ్రమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. పలువురు సినీ తారులు ఆమెకు మద్దతు తెలిపారు. జయాబచ్చన్ మీద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. 

ఈ నేపథ్యంలో జయప్రద స్పందించారు. డ్రగ్స్ కు బానిసలైన యువతను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న రవి కిషన్ కు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నాని, మనమంతా డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని, యువతను రక్షించాలని ఆమె అన్నారు.