జలియన్ వాలా బాగ్: తుత్తికూడి కాల్పులపై డిఎంకె

Jallianwala Bagh: DMK Barb On Police Firing at Sterlite Protest
Highlights

స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులను డిఎంకె జలియన్ వాలా బాగ్ ఊచకోతతో పోల్చింది. 

చెన్నై: స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులను డిఎంకె జలియన్ వాలా బాగ్ ఊచకోతతో పోల్చింది. మంగళవారంనాడు తుత్తికుడి పోలీసు కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరొకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 12కు పెరిగింది.

ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం సంఘటనపై న్యాయవిచారణకు ఆదేశించింది. కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ ను మూసేయాలంటూ చాలా కాలంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. 

గుంపు విధ్వంసానికి దిగడంతో తాము కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు. అనివార్యమైన పరిస్థితిలోనే పోలీసులు కాల్పులు జరిపారని పళని స్వామి అన్నారు. ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. 

రాష్ట్రంలో ఫాసిస్టు పాలన సాగుతోందని, రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని డిఎంకె నేత శర్వనన్ అన్నారు. తమిళనాడులో అతి ఎక్కువ నిరసనలు జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలిందని, అసమర్థమైన ప్రభుత్వం కారణంగానే ఈ స్థితి ఏర్పడిందని అన్నారు. 

డిఎంకె నేత స్టాలిన్ బుధవారం ఉదయం నుంచి సంఘటనపై ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఆందోళనకారులపై కాల్పులు జరపాలని ఆదేశించింది ఎవరని ఆయన అడిగారు. 

ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఆటోమేటిక్ ఆయుధాలు ఎందుకు వాడారని, ఏ చట్టం కింద వాటిని ప్రయోగించారని, తీవ్రమైన గాయాలు కాకుండా రబ్బర్ లేదా ప్లాస్టిక్ బుల్లెట్లు వాడలేదని, కాల్పులకు ముందు హెచ్చరికలు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 

స్టెరిలైట్ నిరసన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు తగిన పోలీసులు బలగాలు ఎందుకు లేవని అదడిగారు. రాష్ట్ర నిఘా విభాగం పూర్తిగా విఫలమైందని అన్నారు .

loader