7 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి , 11,000 చీరలు.. జయలలిత అక్రమార్జన కేసులో కళ్లు చెదిరే ఆస్తులు
Jayalalitha: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత చరాస్తులను డీల్ చేసేందుకు కర్నాటక ప్రభుత్వ న్యాయ శాఖ న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పిపి)గా నియమించింది. నియామకానికి సంబంధించి మార్చి 27న నోటిఫికేషన్ విడుదలైంది.
Jayalalitha: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమార్జన కేసులో దిమ్మతిరిగే ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కర్ణాటక ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో కర్నాటక ప్రభుత్వ న్యాయ శాఖ న్యాయవాది కిరణ్ ఎస్ జవలిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పిపి)గా నియమించింది. తెలిసిన ఆదాయ వనరుల నుండి అక్రమార్జన ఆస్తుల విషయంలో ఈ ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి. నియామకానికి సంబంధించి మార్చి 27న నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ అక్రమార్జన ఆస్తుల కేసు 1996 నాటిది. ఈ కేసును 2003లో సుప్రీంకోర్టు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసింది. తర్వాత 2014లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి సంబంధించిన కేసుల్లో జయలలితను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. 1996 డిసెంబర్ 11న జయలలిత నివాసంలో ఆస్తులు జప్తు చేయబడ్డాయి.
చెన్నైలోని జయలలిత నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం వద్ద ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఏడు కిలోల బంగారు, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి ఆభరణాలు, 11,000కు పైగా చీరలు, 750 పాదరక్షలు, 91 వాచీలు, 131 సూట్‌కేసులు, 1,040 వీడియో క్యాసెట్‌లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్‌లతో సహా ఎలక్ట్రికల్ వస్తువులు, ఇతర బట్టలు ఉన్నాయి.
చర ఆస్తులను పారవేసేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవసరంపై 2022 అక్టోబర్‌లో కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సీబీఐ లేఖ రాసింది. ఆర్టీఐ కార్యకర్త టి నరసింహ మూర్తి ఈ కేసులో జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన వివరాల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఆయన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుండి కూడా సమాచారాన్ని కోరాడు, వివరాలను అతనికి అందించాలని కోర్టు ఆదేశించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు ఎదురుదెబ్బ తలిగిలింది. జయలలిత దొషేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఒక రూపాయే వేతనంగా తీసుకుని జయలలిత ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
1996లో అక్రమాస్తుల కేసులో జయలలితపై తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం జయలలిత రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ సాగిన ఈ కేసులో న్యాయస్థానం చివరికి జయలలితను దోషిగా నిర్థారించింది. ఆమె ఆస్తులను 66 కోట్లుగా న్యాయస్థానం లెక్క కట్టింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న జయ స్నేహితురాలు వీకే శశికళను కోర్టు దోషిగా నిర్దరించడంతో ఆమె జైలు శిక్షను అనుభవించి గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన విషయం తెలిసిందే..