భారతదేశంలో మహిళలపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉన్మాదులు స్వదేశంలోని మహిళలేనే కాకుండా విదేశాల నుంచి మన దేశాన్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులను సైతం కనికరం లేకుండా తమ కామ దాహానికి బలి చేస్తున్నారు. భారతదేశాన్ని సందర్శించడానికి ఇటలీ నుంచి ఓ పర్యాటకురాలిపై ముంబైకి చెందిన టూర్ గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జూన్ 14వ తేదీన జరిగింది. కాగా.. భారత్‌లోని ఇటలీ రాయబార కార్యాలయం జోక్యంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇటలీ నుంచి వచ్చిన 37 ఏళ్ల బ్యాంకర్‌ను అమితాబచ్చన్ బంగ్లా చూపిస్తానంటూ ఓ టూరిస్ట్ గైడ్ నమ్మబలికి, బస్సులో టూర్‌కి తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటల తర్వాత బస్ టూర్ ముగియగానే కొలాబాలోని హోటల్‌లో డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని వెళ్లాడు. గైడ్ మాటలు నమ్మిన టూరిస్ట్, కారులో హోటల్‌కి బయలుదేరింది. మార్గమధ్యంలో టూరిస్ట్ ఓ లిక్కర్ షాపు వద్ద కారు ఆపి, మద్యం సేవించాడు. గైడ్ మద్యం సేవించడమే కాకుండా, తనని కూడా సేవించాలని బలవంతం చేసినట్లు టూరిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

గైడ్ మద్యం మత్తులో టూరిస్ట్‌ను కారులోనే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు టూరిస్ట్ ముంబైలోని ఇటలీ ఎంబసీని చేరుకొని జరిగినదంతా వివరించగా, వారు ముంబైలోని కోలాబా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది, టూరిస్ట్‌పై అత్యాచారం చేసిన గైడ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.