Asianet News TeluguAsianet News Telugu

ఈ రకం ప్రమాదాలకు ఇన్సూరెన్స్ రాదు.. సుప్రీం కోర్టు

 నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురైతే.. అలాంటి ప్రమాదానికి బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. 

Insurance Claim Not Permissible if Accident Caused by One's Own 'Rash Driving', Says Supreme Court
Author
Hyderabad, First Published Sep 4, 2018, 3:08 PM IST

కార్లు, ద్విచక్రవాహనాలు కొనే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ లకి అఫ్లై చేస్తుంటారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగి వాహనం దెబ్బతింటే.. ఆ ఇన్సూరెన్స్ క్లైం చేసుకుంటూ ఉంటారు. అయితే.. వాహనాన్ని వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురైతే.. అలాంటి ప్రమాదానికి బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ‘పర్సనల్‌ యాక్సిడెంట్‌’ పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు వెల్లడించింది.

జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి 2012 మే 20న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన స్వయం తప్పిదం వల్లే ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. అయితే త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల ఇన్స్యూరెన్స్‌ చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. 

దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించింది. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాంటి సందర్భాల్లో మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు కూడా ఇన్స్యూరెన్స్‌ కోరొద్దని పేర్కొంది. అయితే పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ కింద భౌమిక్‌ కుటుంబానికి రూ.2లక్షల బీమా ఇవ్వాలని కోర్టు జాతీయ బీమా కంపెనీని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios