3 నెలల్లోగా దర్యాప్తు సంస్థలు, పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు
New Delhi: కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇది వ్యతిరేక వ్యాజ్యం కాదు. ఈ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్, దర్యాప్తు సంస్థల అధికారులు పారదర్శకతను కాపాడటానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ఆదేశాలను పాటించాల్సి ఉంది" అని జస్టిస్ బీఆర్. గవాయ్ ప్రత్యేక బెంచ్ నొక్కి చెప్పింది.
CCTVs in Central agencies, police stations: నిందితులు, అండర్ ట్రయల్ ఖైదీల మానవ హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసం దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ లేదా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని 2020 డిసెంబర్ లో ఇచ్చిన తీర్పులోని ఆదేశాలను పాటించడానికి సుప్రీంకోర్టు కేంద్రానికి జూలై 18 వరకు మూడు నెలల గడువు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు పలు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేంద్రానికి సంబంధించినంత వరకు ఏడు దర్యాప్తు సంస్థల్లో నాలుగు దర్యాప్తు సంస్థల విషయంలో చిత్తశుద్ధితో కూడిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని సుప్రీంకోర్టు తాజా అఫిడవిట్ లో పేర్కొంది. ఒకవేళ కేంద్రం అంగీకరించకపోతే, అఫిడవిట్ దాఖలు చేయకపోతే, "భారత హోం శాఖ కార్యదర్శి తదుపరి విచారణ రోజున వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వారిపై ధిక్కార చర్య ఎందుకు తీసుకోకూడదో కారణం చూపాలి" అని కోర్టు ఆదేశించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సహా విచారణలు నిర్వహించే, అరెస్టు చేసే అధికారం ఉన్న ఏదైనా ఇతర ఏజెన్సీ కార్యాలయాల్లో సీసీటీవీ, వీడియో రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని జస్టిస్ రోహింటన్ నారిమన్ (రిటైర్డ్) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2020 డిసెంబర్ తీర్పులో కేంద్రాన్ని ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ తీర్పును కేంద్రం, రాష్ట్రాలు ఇంకా పూర్తిగా పాటించలేదని కోర్టు తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేవలం 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కోర్టు ఆదేశాలను పాటించి సీసీటీవీలను ఉర్పాటుచేశాయి. "ఇది వ్యతిరేక వ్యాజ్యం కాదు. ఈ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్, దర్యాప్తు సంస్థల అధికారులు పారదర్శకతను కాపాడటానికి, భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ఆదేశాలను పాటించాల్సి ఉంది" అని జస్టిస్ గవాయ్ బెంచ్ నొక్కి చెప్పింది. అండమాన్ నికోబార్ దీవులు, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు మిజోరం, గోవా రాష్ట్రాలు మాత్రమే ఈ ఆదేశాలను పూర్తిగా పాటించాయనీ, బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైన, జూలై 18 లోపు అవసరమైన అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రధాన కార్యదర్శి లేదా అడ్మినిస్ట్రేటర్ కూడా తదుపరి విచారణ రోజున వ్యక్తిగతంగా ఈ కోర్టుకు హాజరై, వారిపై ధిక్కార చర్య ఎందుకు తీసుకోకూడదో కారణం చెప్పాలని కోర్టు ఆదేశించింది.