Asianet News TeluguAsianet News Telugu

ఇకపై GPS ఆధారంగా టోల్ వసూళ్లు , త్వరలోనే అమల్లోకి - ఎంత దూరానికి అంతే ఫీజు, ఎలా పనిచేస్తుందంటే..?

జాతీయ రహదారులపై టోల్ వసూలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా విధానాలను ప్రవేశపెడుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

India To Soon Launch GPS-Based Toll Collection soon , how it will work ksp
Author
First Published Feb 11, 2024, 8:43 PM IST

జాతీయ రహదారులపై టోల్ వసూలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా విధానాలను ప్రవేశపెడుతోన్న సంగతి తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలు కనిపించకూడదన్న ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ ఏర్పాట్లు చేస్తోంది. నగదు రహిత విధానంలో తీసుకొచ్చిన ఫాస్టాగ్ సక్సెస్ కావడంతో మరో కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. జీపీఎస్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన కన్సల్టెంట్‌ని ఇప్పటికీ నియమించింది. ఫాస్టాగ్‌తో పాటు ఈ సిస్టమ్ కూడా కొనసాగుతుందని, దీనిని తొలుత పైలట్ ప్రాజెక్ట్‌టా చేపడతామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఎంతదూరం ప్రయాణిస్తే అంత వరకే టోల్ వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 

జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే :

జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్.. జాతీయ రహదారులపై అమర్చిన కెమెరాల ద్వారా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) వ్యవస్ధను ఉపయోగించి వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో వినియోగిస్తున్న ఫాస్టాగ్స్ ప్లాజాల్లో ఆర్ఎఫ్ఐడీ ఆధారంగా టోల్ సేకరణను ఉపయోగిస్తోంది. హైవేలపై వాహనాలు వెళ్తున్న సమయంలో వాహనాల కదలికల్ని కెమెరాలు పసిగడతాయి. తద్వారా ఎక్కడ వాహనాలు ఎంట్రీ ఇచ్చాయి.. ఎక్కడ ఎగ్జిట్ అయ్యాయి అనే వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తుంది. మీ ప్రయాణ దూరాన్ని విశ్లేషించి టోల్ ఫీజును నిర్ణయిస్తుంది. 

జాతీయ రహదారుల మీద తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ విధానం వల్ల ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు.. రోడ్డుపై వాహనాలు టోల్ చెల్లింపుల కోసం ఎదురుచూడటం వంటి క్యూల బాధలు తప్పుతాయి. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా వాహనదారుడు తాను లింక్ చేసిన ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా టోల్ ఫీజును రాబట్టుకుంది. దీని వల్ల టోల్ ఎగవేత అవకాశాలు తగ్గుతాయని విశ్లేషకులు అంటున్నారు. 

కేంద్రానికి కాసులు కురిపిస్తోన్న టోల్ ఫీజులు :

టోల్ ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు ఎన్‌హెచ్ఏఐకి టోల్ వసూళ్ల ద్వారా రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో దీని విలువ రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని కేంద్రం అంచనా వేసింది. ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గింది. గతంలో ఇది 8 నిమిషాలుగా వుండేదని గణాంకాలు చెబుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios