కరోనా మహమ్మారి భారత్ ని పట్టిపీడిస్తోంది. దేశంలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోయి ప్రమాదకరస్థాయికి చేరుకుంది. పాజిటివ్ కేసుల పరంగా నేటితో ‌ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది .గ‌డిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 90 వేల 802 కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42 ల‌క్ష‌ల 4 వేల 641కి చేరింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతూ వ‌చ్చిన‌ బ్రెజిల్‌ను.. ఇండియా ఇవాళ దాటేసింది. ప్ర‌స్తుతం బ్రెజిల్‌లో 41.37 ల‌క్ష‌ల కేసులు ఉండ‌గా..ఇండియా కేసులు 42 ల‌క్ష‌లు దాట‌డంతో ఈ రికార్డ్‌ను న‌మోదు చేసింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా ఇండియాలో పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొత్తం ప్ర‌పంచంలో క‌రోనా వ్యాప్తి చెందిన 215 దేశాల్లో.. 181 దేశాల్లో మొత్తం కేసుల సంఖ్య‌నే 90 వేలు దాటలేదు. అలాంటిది ఇండియాలో రోజువారీ కేసులే 90 వేల‌కుపైనా న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ప్ర‌స్తుతం 64 ల‌క్ష‌ల‌కుపైగా కేసులతో అమెరికా మొద‌టి స్థానంలో ఉండ‌గా… అక్క‌డ రోజువారీ కేసులు 40-45 వేల కేసులే న‌మోద‌వుతున్నాయి. కానీ ఇండియాలో అది రెట్టింపు స్థాయిలో ఉంది. మ‌ర‌ణాల విష‌యంలోనూ అంతే. అమెరికాలో రోజూ స‌గ‌టున 700 నుంచి 800 మంది క‌రోనా కార‌ణంగా చ‌నిపోతుండ‌గా.. ఇండియాలో వేయ్యికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో క‌రోనా తీవ్ర‌త చూస్తోంటే ఈ నెల‌లోనే ఇండియా అగ్ర‌స్థానానికి చేరుకునే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.