నాలుగేండ్ల‌లో 3117 మంది మైనారిటీలకు భారత పౌరసత్వం: కేంద్రం

న్యూఢిల్లీ: పొరుగుదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఏళ్లుగా వేధింపులు అనుభవించి, భారత్‌లో తప్ప మరెక్కడా ఆశ్రయం పొందలేకపోయిన ఆయా దేశాల్లోని  మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన  పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకు)  సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప‌లు విష‌యాలు వెల్ల‌డించింది.  గ‌త నాలుగేండ్ల‌లో ఆయా దేశాల‌కు చెందిన మొత్తం 3117 మంది మైనారిటీల‌కు భార‌త పౌర‌త్వం క‌ల్పించినట్టు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  
 

India granted citizenship to 3117 minorities past 4 years: MHA

Indian citizenship: దేశంలో గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ల‌కు చెందిన మొత్తం 3117 మంది మైనారిటీలకు భారత పౌరసత్వం ల‌భించింది. పార్ల‌మెంట్‌లో ఓ స‌భ్యుడు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. 2018, 2019 సంవత్సరాల్లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ సమూహాల నుండి వచ్చిన మొత్తం పౌరసత్వ దరఖాస్తులకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించాల‌ని పార్లమెంటు సభ్యుడు డాక్టర్ కె కేశవ రావు ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా లిఖిత‌పూర్వ‌క స‌మాధానంగా వివ‌రాలు వెల్ల‌డించారు. 2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్  దేశాల‌కు చెందిన  హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ సమూహాల నుండి వచ్చిన పౌరసత్వ దరఖాస్తుల సంఖ్య 8244 అని రాయ్ తన సమాధానంలో పేర్కొన్నాడు.  ఈ నాలుగు సంవ‌త్సరాల్లో కాలంలో 3117 మంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని మంజూరు చేసింద‌న్నారు.

Also Read: Odisha: ఒడిశాలో కోటి రూపాయల డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

అలాగే, శ‌ర‌ణార్థుల‌కు సంబంధించిన వివ‌రాల గురించి కూడా పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. శరణార్థులతో సహా విదేశీ పౌరులందరూ విదేశీయుల చట్టం-1946, విదేశీయుల నమోదు చట్టం-1939, పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం-1920,  పౌరసత్వ చట్టం-1955లో ఉన్న నిబంధనల ద్వారా నియంత్రించబడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్ల‌డించారు.  ఇదిలావుండ‌గా, వాడివేడీగా సాగిన పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు  బుధ‌వారం ముగిశాయి. ఉభ‌య స‌భ‌లు ఇవాళ నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. లోక్‌స‌భ‌లో 18 గంట‌ల 48 నిమిషాల పాటు శీతాకాల స‌భా స‌మ‌యం వృధా అయిన‌ట్లు స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు.  స‌భా స‌మావేశాల గురించి ఓం బిర్లా మాట్లాడుతూ.. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో ప‌లు కీల‌క‌మైన బిల్లులు, ప‌లు అంశాలు చ‌ర్చ‌ల‌కు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు.  లోక్‌స‌భ‌లో ఒమిక్రాన్‌, వాతావ‌ర‌ణ మార్పులతో పాటు ఇత‌ర ముఖ్య అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. మ‌రో వైపు రాజ్య‌స‌భ‌ను కూడా నిర‌వ‌ధిక వాయిదా వేశారు. దీనిపై రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ.. శీతాకాల స‌మావేశాలు అంచ‌నాల‌కు త‌గిన రీతిలో జ‌ర‌గ‌లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  నిజానికి ఈ స‌మావేశాలు మ‌రింత బాగా జ‌ర‌గాల్సి ఉంద‌ని, ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో స‌భ్యులో ఆత్మావ‌లోక‌నం చేసుకోవాల‌ని పేర్కొన్నారు.  స‌భ్యుల‌కు క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ గ్రీటింగ్స్‌ను తెలిపారు.

Also Read: Omicron: దేశంలో కొత్త‌గా 13 ఒమిక్రాన్ కేసులు.. అత్య‌ధికం ఢిల్లీలోనే !

ఇదిలావుండ‌గా, ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన పౌరసత్వ సవరణ చ‌ట్టం (సీఏఏ)  తీవ్ర వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘానిస్థాన్ వంటి భార‌త స‌రిహ‌ద్దు దేశాల్లోని మైనారిటీల‌కు పౌర‌స‌త్వం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఆయా దేశాల్లోని  హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ సమూహాల పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే, ఆయా దేశాల్లోని ముస్లి వ‌ర్గాల‌కు ఇందులో చోటుక‌ల్పించ‌క‌పోవ‌డంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దేశంలోని ముస్లింల‌తో పాటు అంత‌ర్జాతీయంగానూ మ‌తాల‌ను ఆధారంగా పౌర‌స‌త్వం క‌ల్పించ‌డంపై ప‌లు సంస్థ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. గ‌తేడాది  దేశంలో చాలా చోట్ల నిరసనలు జరిగాయి.  ఈ చట్టం ముస్లింలపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ జనాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వ‌హించారు.  ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, కర్నాటక, ఢిల్లీలో ఇలాంటి ప్రదర్శనలు హింసాత్మకంగానూ మారాయి.

Also Read: Karnataka: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios