అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో నిర్భయ వంటి ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల దళిత యువతిని కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు.

మృతదేహానికి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బుధవారంనాడు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. నలుగురు వ్యక్తులు మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిం్చారు 

మహిళను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతురాలు నిరుడు డిసెంబర్ 31వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారంనాడు ఆమె శవం కనిపించింది. 

యువతి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 3వ తేదీన పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు యువతి క్షేమంగానే ఉందని, తన సామాజిక వర్గానికి చెందిన యువకుడితో లేచిపోయిందని, ఇద్దరు పెళ్లి చేసుకున్నారని, అందువల్ల కేసు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని స్తనిక పోలీసు ఇన్ స్పెక్టర్ ఎన్.ఎల్ రబారీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నెల 5వ తేదీన ఆమె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తమ అమ్మాయిని హత్య చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. బిమల్ భర్వాడ్, దర్శన్ భర్వాడ్, సతీష్ భర్వాడ్, జిగర్ అనే నలుగురు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.