మీరట్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకొంది. కదులుతున్న బస్సులో ఓ మహిళ గ్యాంగ్ రేప్ కు గురైంది. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిని బస్సు నుండి బయటకు తోసేశారు.

మీరట్ లోని ఢిల్లీ  రోడ్డులో శనివారంనాడు తెల్లువారుజామున ఓ మహిళ అపస్మారక స్థితిలో కన్పించింది.  స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.

శుక్రవారం నాడు రాత్రి భైసాలి బస్టాండ్ లో బాధితురాలు బస్సు ఎక్కింది.  బస్సులోని సిబ్బంది ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చారు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది.

స్పృహ కోల్పోయిన తనపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. 

బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

బాధితురాలు బస్సు ఎక్కిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.