న్యూఢిల్లీ: ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ అరెస్టయ్యారు. దీంతో ఐసీఐసీఐ - వీడియో కాన్ రుణాల కుంభకోణం కేసు కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లయింది. రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడినట్లు నమోదైన మనీ లాండరింగ్ కేసులో సోమవారం మధ్యాహ్నం దీపక్ కొచ్చర్ ను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. 

వీడియో కాన్ గ్రూప్ నకు చెందిన రూ.1875 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు, అవినీతికి పాల్పడినట్లు చందా కొచ్చర్ దంపతులపైనా, వీడియో కాన్ గ్రూప్ నకు చెందిన వేణుగోపాల్ దూత్ పైనా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిరుడు జనవరిలో ఈడీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 

ఆ నేపథ్యంలోనే చందా కొచ్చర్ ను ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి తప్పించింది. ఈ కేసులో దీపక్ కొచ్చర్ ను పలుమార్లు విచారించింది. చివరగా సోమవారం కూడా విచారించి రాత్రి వేళ అతన్ని అరెస్టు చేసింది. 

ఆదే విధంగా చందా కొచ్చర్ హయాంలో గుజరాత్ లోని స్టెర్లింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ, భూషణ్ స్టీల్ గ్రూప్ లకు ఐసీఐసీఐ నుంచి రుణాలు మంజూరు చేయడంలో కూడా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.