కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఇకపై విపత్తులు, ప్రమాదాల విజువల్స్‌పై ఆ వివరాలు తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలకు సంబంధించిన వార్తలు, విజువల్స్ ప్రసారం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అన్నింటిపై మీడియా ప్రభావం చాలానే ఉంటోంది. ఇక, సోషల్ మీడియా గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలకు సంబంధించిన వార్తలు, విజువల్స్ ప్రసారం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. విపత్తులు, ప్రమాదాలకు సంబంధించిన విజువల్స్‌పై తేదీ, టైమ్ స్టాంప్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఈ సూచనలు వార్తా ఛానెళ్లు, మీడియా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచన ప్రకారం, టెలివిజన్ ఛానళ్లు ప్రకృతి విపత్తులు, పెద్ద ప్రమాదాలను కొన్నిరోజుల పాటు నిరంతర కవరేజ్ అందిస్తుంటాయి. అయితే, సంఘటన జరిగిన రోజు చూపించిన వీడియోలు, ఫుటేజీనే మళ్లీ మళ్లీ చూపిస్తుంటారు. ఇది కొన్నిసార్లు అయోమయం, ఆందోళనకు దారి తీసే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రసారం చేసే విజువల్స్ తాజావి అనుకొనే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిసార్లు టెలికాస్ట్ అయ్యే దృశ్యాలకు వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా ఉండవచ్చని అభిప్రాయపడింది.
ఇలాంటి అపోహలకు దారితీయకుండా ఉండేందుకు టెలివిజన్, మీడియా ఛానెళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రైవేట్ శాటిలైట్ TV ఛానళ్లు విపత్తుల, ప్రకృతి వైపరీత్యాలు, పెద్ద ప్రమాదాల వీడియోలపై 'తేదీ, సమయం' ముద్రను స్పష్టంగా చూపించాలని తేల్చి చెప్పింది. తేదీ, సమయాన్ని చూపించడం ద్వారా వీక్షకులకు ప్రసారం చేస్తున్న వీడియోకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుతుంది. ఇంకా సంఘటన స్థలంలో వాస్తవ పరిస్థితి తెలుస్తోంది.
ఇటీవల వయనాడ్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రకృతి విపత్తులు, భూకంపాల విస్తృత కవరేజీ తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ సూచన చేసింది.