హర్యానా: హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మరోసారి సహనం కోల్పోయారు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు చేతిపై బాదడంతో ఆ ఫోన్ కాస్త కిందపడిపోయింది. 

వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని కర్నాల్ లో ఓ వేడుకకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం ఖట్టర్ ను చూసిన ఓ యువకుడు ఆయన పాదాలకు నమస్కారం చేసి అనంతరం సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. 

దాంతో కోపోద్రిక్తుడైన సీఎం ఆ యువకుడి చేతిపై బాదారు. దీంతో అతని చేతిలో సెల్ ఫోన్ కింద పడిపోయింది. సెల్ఫీ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పూలు చల్లుకుంటూ వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సీఎం సహనం కోల్పోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం మనోహర్ లాల్ కట్టర్ సహనం కోల్పోవడం ఇదేమీ కొత్తకాదని సెటైర్లు వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దంపతులు తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించేందుకు వస్తే వారిపై సీఎం చిర్రుబుర్రులాడారు. అప్పట్లో ఈ వ్యవహారం కాస్త పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా యువకుడిపై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆగ్రహం చేస్తూ ఇలా చిక్కారు.