కన్న కొడుకు భార్యతో సంతోషంగా ఉంటే చూసి ఆనందించాల్సిందిపోయి.. వారిని దూరం చేసి పాశవిక ఆనందానికి  పొందాడు ఓ వ్యక్తి. కోడలి శరీరంలో దెయ్యం ఉందని.. కొడుకు కాపురం చేస్తే.. ఆ దెయ్యం తన కొడుకు శరీరంలోకి వెళ్తుందంటూ వితండవాదం చేశాడు. అక్కడితో ఆగకుండా ఇంట్లో కోడలిని తన భార్యతో కలిసి చిత్ర హింసలకు గురిచేశాడు. వాటిని భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సదరు మహిళకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. కాగా.. వివాహానంతరం తన భర్తతో కలిసి నివసించేందుకు మహిళ వదోదర నుంచి గాంధీనగర్‌ వచ్చారు. తాము శారీరకంగా కలిస్తే తనలో ఉన్న దెయ్యం ఆత్మ వారి కుమారుడిలో కలుస్తుందని తన మామ ఆక్షేపిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. 

మామ తనను లైంగిక వేధింపులకు గురిచేసేలా స్వయంగా అత్త ప్రేరేపిస్తున్నారని వాపోయారు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు తనను లొంగదీసుకోవాలని మామగారు చాలా సార్లు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకపోవడంతో.. తనను పశువుకన్నా హీనంగా కొట్టారని ఆమె చెప్పారు. ఇక అత్తింటి వేధింపులు భరించలేక మార్చి 10న తాను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చానని, కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా వారు తనను ఆదరించేందుకు అంగీకరించలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.