Asianet News TeluguAsianet News Telugu

హ‌త్య, గ్యాంగ్ రేప్ నిందితుల‌ విడుద‌ల.. గుజరాత్ సర్కార్, ప్రధాని మోడీపై ఒవైసీ విమర్శలు

Asaduddin Owaisi: బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హ‌త్య కేసులో 11 మంది దోషులను విడుద‌ల చేయ‌డానికి గుజ‌రాత్ స‌ర్కారు ఒకే చెప్ప‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ప్ర‌ధానమంత్రి స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. "ఇది బీజేపీ వెర్ష‌న్ ఆజాదీ కా అమృత్" అని విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

Gujarat government releases murder and rape convicts;  This is BJP version of Azadi ka Amrit, owaisi said.
Author
Hyderabad, First Published Aug 16, 2022, 12:08 PM IST

Bilkis Bano gang rape case: 2002లో గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత క్రూరంగా హత్య చేసిన కేసులో.. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల‌ను గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం విడుదల చేసింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గ్యాంగ్ రేప్, హ‌త్య కేసులు దోషుల‌ను విడుద‌ల హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ప్ర‌ధానమంత్రి స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. "ఇది బీజేపీ వెర్ష‌న్ ఆజాదీ కా అమృత్" అని విమ‌ర్శ‌లు గుప్పించారు. "ఒక క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఒక మతం పట్ల బీజేపీ పక్షపాతం అంటే క్రూరమైన అత్యాచారం & ద్వేషపూరిత నేరాలు కూడా క్షమించదగినవి. రుబినా మెమన్‌ను కూడా బీజేపీ-షిండే మహా ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీని పరిగణనలోకి తీసుకుంటుందా?" అని ప్ర‌శ్నించారు. 

జనవరి 21, 2008న ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టు, బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. ఈ దోషులు 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు, ఆ తర్వాత వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ప్యానల్‌కు నేతృత్వం వహించిన పంచమహల్స్ కలెక్టర్ సుజల్ మయాత్ర తెలిపారు.

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హ‌త్య కేసు
 
ఫిబ్రవరి 27, 2002న 59 మంది 'కరసేవకులను' చంపిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగులబెట్టిన తరువాత హింస చెలరేగింది. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానో తన కుమార్తె స‌హా మ‌రో 15 మంది కుటుంబ స‌భ్యుల‌తో కలిసి తన గ్రామం నుండి పారిపోయింది. మార్చి 3న, వారు ఒక‌ పొలంలో ఆశ్రయం పొందారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌కు కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన 20-30 మంది గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయగా, ఆమె కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా కొట్టి చంపారు. మరో ఆరుగురు సభ్యులు త‌ప్పించుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో నిందితులను 2004లో అరెస్టు చేశారు.

అహ్మదాబాద్‌లో విచారణ ప్రారంభమైంది. అయితే, బిల్కిస్ బానో.. సాక్షులకు హాని కలిగించవచ్చని, సీబీఐ సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన తరువాత, సుప్రీంకోర్టు ఆగస్టు 2004లో కేసును ముంబ‌యికి బదిలీ చేసింది. జనవరి 21, 2008న బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం. హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది ప్రత్యేక CBI కోర్టు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం గర్భిణీ స్త్రీపై అత్యాచారం, హత్య, చట్టవిరుద్ధంగా సమావేశానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వారికి శిక్ష పడింది. అయితే, సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రత్యేక కోర్టు మరో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. నిందితుల శిక్షను సమర్థిస్తూ 2018లో బాంబే హైకోర్టు ఏడుగురి నిర్దోషుల తీర్పును రద్దు చేసింది. బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, ఇల్లు ఇవ్వాల‌ని 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios