మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బంధువులు, దగ్గరివారే ఈ ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. లైంగిక దాడుల మీద ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యులే, అండగా నిలుస్తారు అనుకున్నవారే అపరరాక్షసులుగా మారిపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణ సంఘటనే వెలుగుచూసింది.

అభం, శుభం తెలియని ఆరేళ్ల బాలికమీద మేనమామ, తాత అత్యాచారానికి ఒడిగట్టారు. అది కూడా మూడేళ్ల బాధితురాలి సోదరుడు కళ్లెదుటే జరగడం హృదయాన్ని మెలిపెట్టే అమానుష ఘటన. అయితే ఈ ఘటన జరిగి ఎనిమిది రోజుల తరువాత...తాజాగా గురువారం వెలుగులోకి వచ్చింది.

కూతురు మామూలుగా లేకపోవడం గమనించిన తల్లి కూతుర్ని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. గురువారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు ఎప్పటిలాగే నార్మల్గా కనిపించకపోవడంతో ఏమైందని ప్రశ్నించింది.

అయితే ఆ చిన్నారి విషయం చెబితే.. అమ్మ తిడుతుందేమోనని భయపడిపోయింది. నోరు విప్పలేదు. అయితే  తల్లి గట్టిగా మందలించడంతో.. తనకు జరిగిన విషయాన్ని వివరించింది. అది విని షాక్ కు గురైన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేసింది. 
దీనిపై పోలీసులు మాట్లాడుతూ 7, 8 రోజులకు ముందు బాలిక మామయ్య ఆమెని తన మూడేళ్ల సోదరుడిని సమోసాలు కొనిస్తానని చెప్పి బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మామయ్యతో పాటు తాతవరసయ్యే అతను.. ఇద్దరూ కలిసి బాలికను గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 

ఆ తరువాత నిందితుడు మైనర్ బాలికకు రూ. 20 ఇచ్చి ఈ సంఘటన ఎవరికీ చెప్పొద్దని కోరినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు 48 ఏళ్ల తాత అని, మరొకరు మామ వరుస అయ్యే దూరపు బంధువు(20) అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను  పోక్సో యాక్ట్‌ కింద అరెస్టు చేసి విచారిస్తున్నారు తెలిపారు.