లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఆమెను చంపేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలిక శవం చెరుకు తోటలో కనిపించిింది. 

ఆ సంఘటనకు సంబంధించిన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురిని గొంతు నులిమి చంపేశారని, కనుగుడ్లు పీకేశారని, నాలుకను కోశారని మృతురాలి తండ్రి చెప్పాడు. ఈ సంఘటన నేపాల్ సరిహద్దులోని ఓ గ్రామంలో శుక్రవారంనాడు చోటు చేసుకుంది. 

బాలిక శవం ఓ నిందితుడి వ్యవసాయ క్షేత్రంలో కనిపించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. నిందితులిద్దరిపై రేప్, హత్య కేసులు నమోదు చేసినట్లు, జాతీయ భద్రతా చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 

శుక్రవారం సాయంత్రం బాలిక కనిపించకుండా పోయింది. తాము ఆమె కోసం ప్రతిచోటా వెతికామని, చివరకు చెరుకు తోటలో శవం కనిపించిందని, దుపట్టాతో ఉరివేసి ఆమెను చంపేశారని, కనుగుడ్లు పీకేశారని, నాలుకను కోశారని మృతురాలి తండ్రి చెప్పాడు. 

సంఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ఈ ఘటన అత్యంత సిగ్గుచేటైందని ఆమె అన్నారు. ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. 

ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో జరిగింది. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనను మరిచిపోక ముందు లఖీపూర్ జిల్లా ఖేర్ జిల్లా ఘటన జరిగింది.