లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక మృతదేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో బయటపడింది. అత్యాచారం చేసి బాలికను హత్య  చేశారని పోలీసులు చెప్పారు. 

పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామానికి సమీపంలో శవం ఎండిపోయిన పాడుబడిన బావి వద్ద పడి ఉంది. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. 

నిందితుడిని గుర్తించి, అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు స్కాలర్ షిప్ ఫారం నింపడానికి సోమవారంనాడు బాలిక ఇంటి నుంచి వెళ్లింది. అయితే, తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .

ఏం చెప్పాలో, ఎవరిని అనుమానించాలో తెలియడం లేదని బాలిక అంకుల్ అంటున్నాడు. ఆమె ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు వెళ్లిందని, ఎవరినీ అనుమానించలేమని ఆయన అన్నారు. ఈ జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం గత పది రోజుల్లో ఇది రెండోది. 

ఆగస్టు 15వ తేదీన 13 ఏళ్ల బాలిక అత్యాచారానికి, హత్యకు గురైంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు