జల్పాయిగురి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేసి శవాన్ని ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి జిల్లాలో జరిగింది. 

పదో తరగతి చదువుతున్న బాలిక ఆగస్టు 10వ తేదీన అదృశ్యమైంది. దానిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రాజ్ గంజ్ లోని శ్యానిశికటలో నివాసం ఉంటుంది. 

ఆగస్టు 20వ తేదీన పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాము ఆగస్టు 15వ తేదీన బాలికను చంపినట్లు విచారణలో వారు అంగీకరించారు. గ్యాంగ్ రేప్, హత్య కేసుల్లో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆగస్టు 21వ తేదీన న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వారిని 8 రోజుల పాటు కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. 

ఆ రాత్రి పోలీసులు ప్రధాన్ పారాలోని ఇంటి ఆవరణలో గల సెప్టిక్ ట్యాంక్ నుంచి బాలిక శవాన్ని వెలికి తీశారు. టీఎంసీ ఎమ్మెల్యే ఖగేశ్వర రాయ్ మృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.