భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతిపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. తన సోదరుడితో కలిిస స్వగ్రామానికి తిరిగి వస్తున్న యువతిపై వారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

యువతి సోదరుడిని బావిలోకి తోసేసి యువతిపై దుండగులు అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

యువతి తన అన్నయ్యతో కలిసి బుధవారం రాత్రి మోటార్ బైక్ మీద స్వగ్రామానికి తిరిగి వస్తుండగా దుండగులు దారుణానికి పాల్పడినట్లు కోట్వాలీ పోలీసు స్టేషన్ ఇంచార్జీ రాజేంద్ర ధుర్వే చెప్పారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగులు మోటార్ బైక్ ను అడ్డగించి, యువతి అన్నయ్యను బావిలోకి తోసేశారు. ఆ తర్వాత మర్నాడు తెల్లవారు జాము 2 గంటల వరకు ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చారు. 

దుండగులు వెళ్లిపోయిన తర్వాత యువతి తన అన్నయ్యను కాపాడి మర్నాడు ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుభం బేలే (22), సందీప్ ఖటియా (23) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు మైనర్లను కూడా అరెస్టు చేశారు. 

మరో ఇద్దరు నిందితులను లోకేష్ సోనీ (22), పవన్ బేలె (24)లుగా గుర్తించారు. వారిద్దరు పరారీలో ఉన్నారు. నిందితులపై తగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.