ధన్ బాద్: జార్ఖండ్ రాష్ట్రంలో అఘాయిత్యం జరిగింది. ఐదుగురు వ్యక్తులు ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి గురైన అమ్మాయి మరణించింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితులంతా మ్యారేజీ పార్టీకి చెందినవారు. మ్యారేజీ పార్టీ సభ్యులు జంతారా జిల్లా నుంచి గ్రామానికి వచ్చారు. 

పెళ్లికి వచ్చిన కొంత మంది గ్రామంలోని మరో కార్యక్రమానికి వెళ్లారు. మృతురాలు తమ బంధువుల ఇంటి పక్కనే ఉంటుంది. ఐదుగురు వ్యక్తులు కూడా పీకల దాకా తాగేసి గిరిజన బాలికను బుజ్జగించి శుక్రవారం రాత్రి 9, 10 గంటల మధ్య నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. 

సంఘటన జరిగిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఇంటికి చేరిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ఈ సంఘటనలో ఐదుగురి కన్నా ఎక్కువ మంది పాత్ర ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.