బిలాస్ పూర్: తనపై ఆస్పత్రి ఐసియూలో సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి ఆరోపించింది. చత్తీస్ గఢ్ లోనన బిలాస్ పూర్ ప్రైవేట్ నర్సింగ్ హోంలోని ఐసియూలో చికిత్స పొందుతున్న గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న టీనేజ్ అమ్మాయి ఆ మేరకు ఫిర్యాదు చేసింది. చేతిరాతితో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాధితురాలి తండ్రి బిలాస్ పూర్ సివిల్ లైన్ పోలీసు స్టేషన్ ను సంప్రదించాడు. ఆ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసారు. 

మే 18వ తేదీన 18 ఏళ్ల విద్యార్థిని బిలాస్ పూర్ లోని ఆస్పత్రిలో చేరింది. ఓ మందు వాడడం వల్ల ఆమెకు ఎలర్జీ ప్రారంభమైంది. ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నది.

సంఘటనపై అమ్మాయి తమకు శనివారం సాయంత్రం తెలిపిందని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పారు. ఆక్సిజన్ మాస్క్ , బలహీనత కారణంగా మాట్లాడలేకపోయిందని, తనకు పెన్ను, కాగితం కావాలని సంకేతాల ద్వారా అడిగిందని వారు చెప్పారు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని కాగితంపై రాసి చూపించిందని చెప్పారు. 

ఈ సంఘటనను పోలీసులు తొలుత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదు. మీడియాలో దీనికి సంబంధించిన వార్తాకథనాలు రావడం ప్రారంభించడంతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను అపోలో ఆస్పత్రికి తరలించారు.