మీరట్ లో దారుణం జరిగింది. ఓ 15యేళ్ల మైనర్ బాలికను, కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. కిడ్నాప్ అయిన 9 రోజుల తరువాత ఆమె మృతదేహాన్ని అనాథలా నోయిడా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయారు.

ఈ ఘటనలో ఆమె ఇంతకుముందు కలిసి టూర్ కు వెళ్లిన బంధువులపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బాలిక మాయమైన రోజునుంచి ఆ బంధువుల తమపై పోలీసుల దగ్గరికి వెళ్లద్దంటూ ఒత్తిడి చేస్తున్నారని వారు తెలిపారు. 

“మార్చి 22 న ఉదయం 7.30 గంటల సమయంలో, నా కూతురు పాఠశాలకు వెళ్లింది. కానీ సాయంత్రం చివరి వరకు తిరిగి రాలేదు. దీంతో నేను పాఠశాలకు వెళ్ళాను. అప్పటికే స్కూల్ మూసివేశారు. అక్కడంతా వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. 

రాత్రి 7 గంటల సమయంలో, ఆమె అన్న అత్తమామలు ఇంటికి వచ్చి తమ సానుభూతిని తెలిపారు. అంతేకాదు ఈ విషయం పోలీసులకు చెప్పొద్దన్నారు. అనవసరంగా అపఖ్యాతి పాలవుతారని అన్నారు అని అమ్మాయి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. 

మేము మా అమ్మాయి కోసం వెతుకుతుంటే.. ఆమె అన్నఅత్తమామలు తరచుగా ఇంటికి వస్తూ పోలీస్ కంప్లైంట్ అనే మాట రావద్దని హెచ్చరించారని తెలిపారు. మార్చి 31, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె మృతదేహం నోయిడాలోని ఓ హాస్పిటల్ లో ఉందని దాని సారాంశం.

అక్కడికి వెళ్లిన మాకు ఆమె మీద సామూహిక అత్యాచారం జరిగిందని, ధూమపానం చేయించారని, కిరాతకంగా చంపేశారని తెలిసింది. స్కూల్ పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ గమనించిన మాకు మా బంధువులు ఇద్దరు ఆమెను తమ బైక్ మీద మధ్యలో ఎక్కించుకుని వెళ్లినట్టు తెలిసింది. వీరిలో ఒకరు మా ఇంటికి వచ్చి కేసు పెట్టొద్దన్న వ్యక్తే అని తండ్రి తెలిపారు. మరోవ్యక్తి ఎవరో తెలియదని అన్నాడు. 

ఈ కేసులో ఇద్దరు బంధువులను, ఓ గుర్తు తెలియని వ్యక్తిని నిందితులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. బైక్ మీద ఆమెను తీసుకుపోయిన వాళ్లే.. ఆమెను అదే బైక్ మీద తీసుకొచ్చి ఆస్పత్రి దగ్గర పడేసి పోయారని తెలిపారు. ఇది గమనించిన డాక్టర్లు వెంటనే ఆమెను పరీక్షించగా, అప్పటికే ఆమె మరణించిందని అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆమె ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించిందని తెలిపారు. 

బాలిక కుటుంబ సభ్యులు ఆమె అన్న అత్తామామల కుటుంబంలోని ఆరుగురి మీద ఫిర్యాదు చేశారు. దీనిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు బైక్ నడిపిన గుర్తు  తెలియని వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి వారి గురించి వెతుకుతున్నారు.

వీళ్లందరిమీద పోక్సో చట్టం కింద కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్యా నేరాలు మోపబడ్డాయని తెలిపారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, బైక్ నడిపిన వ్యక్తి పరారిలో ఉన్నాడని హపూర్ అడిషనల్ ఎస్పీ సర్వేష్ మిశ్ర తెలిపారు.