తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చేయని తప్పుకు తట్టుకోలేక ఓ టెక్కీ ఆత్మహత్యకు చేసుకున్నాడు. నోయిడాలోని ప్రఖ్యాత ఐటీ సంస్థ జెన్‌పాక్‌లో సహాయ వైస్ ప్రెసిడెంట్‌గా స్వరూప్ రాజ్ పనిచేస్తున్నారు. మీటూ ఉద్యమంలో భాగంగా కంపెనీకి చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులు స్వరూప్ తమను లైంగికంగా వేధించాడంటూ ఆరోపింపచారు.

దీంతో కంపెనీ యాజమాన్యం అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. చేయని తప్పుకు మానసిక వేదనకు గురైన స్వరూప్ నోయిడాలోని సెక్టార్ 137లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీనిని గమనించిన అతని భార్య పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భార్యకు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను.. మా కంపెనీలో పనిచేసే ఇద్దరు మహిళలు నాపై నిందలు మోపారు.

అవి ఏదో ఒక రోజు నిందలు అనే విషయం నీతో పాటు అందరికి తెలుస్తుంది. నేను నిర్దోషినని తెలిసినా సరే ఎంతో కొంత అనుమానం మీలో కలుగుతుంది. తాను వేధింపులకు పాల్పడలేదని తేలినా, ఆరోపణల కారణంగా అందరూ తనను అసహ్యంగా చూడటం నేను తట్టుకోలేను .. ఒక విషయం గుర్తు పెట్టుకో నీ భర్త ఎలాంటి తప్పు చేయలేదు..అంటూ నోట్‌లో పేర్కొన్నాడు.