కుమారస్వామి బలపరీక్ష: పరమేశ్వర మెలిక

కుమారస్వామి బలపరీక్ష: పరమేశ్వర మెలిక

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధపడిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత పరమేశ్వర మెలిక పెట్టారు. కుమారస్వామి ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం 12,30 గంటలకు శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరుగుతాయి.

కాంగ్రెసు, జెడిఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ రిసార్టుల్లోనే ఉన్నారు. వారు నేరుగా శాసనసభకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామియే ముఖ్యమంత్రిగా ఉంటారా, ముఖ్యమంత్రి పదవిని ఇరు పార్టీలు పంచుకోవాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పరమేశ్వర అన్నారు. 

అందుకు సంబంధించిన విధివిధానాలను ఇంకా ఖరారు చేయలేదని అన్నారు. ఏ మంత్రిత్వశాఖలు వారు తీసుకుంటారు, మాకు ఏం ఇస్తారనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యమంత్రి పదవి ఐదేళ్ల పాటు జెడిఎస్ కే ఉంటుందా, తాము కూడా పంచుకుంటామా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. అందుకు సంబంధించిన విధివిధానాలపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని అన్నారు. 

ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి జెడిఎస్ ఇవ్వడానికి మీకు సమ్మతమేనా అని అడిగితే కర్ణాటక పిసిసి అధ్యక్షుడు కూడా అయిన పరమేశ్వర - చర్చలు జరిగిన తర్వాత సాధ్యాసాధ్యాలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఉత్తమ పాలనను అందించడమే తమ లక్ష్యమని జవాబిచ్చారు. 

మంత్రిత్వ శాఖలపై, ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరు కూడా తమకు ఇది కావాలని తనను గానీ, రాహుల్ గాంధీని గానీ అడగలేదని అన్నారు. 

కాంగ్రెసు పార్టీలో విభేదాలు ఏమీ లేవని, పదవులు అడగడంలో తప్పేం లేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రికి లేదా ముఖ్యమంత్రికి అర్హులైన వాళ్లు కాంగ్రెసులో చాలా మంది ఉన్నారని, అదే కాంగ్రెసు పార్టీ బలమని పరమేశ్వర అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్థితిలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 

డికె శివకుమార్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించగా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారని, తాము బలపరీక్షలో నెగ్గుతామని అన్నారు. 

కాంగ్రెసు ఎమ్మెల్యేలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. ఆ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 

పిసిసి అధ్యక్ష పదవి గురించి అధిష్టానం నుంచి తనకేమీ సమాచారం లేదని, శివకుమార్ ఏదో ఒక పదవిని ఎంచుకుంటారని అన్నారు. శివకుమార్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వవచ్చుననే వార్తలు వచ్చాయి. 

పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే చాలా సంతోషమని, ఆయన అనుభవం గల నాయకుడని, పార్టీని ముందుకు నడిపించగలరని పరమేశ్వర అన్నారు. 

విశ్వాస పరీక్ష తర్వాత కాంగ్రెసు, జెడిఎస్ నేతలు సమావేశమై సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు. బిజెపి కన్నా ఓట్ల శాతం తమకే ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page