న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎనిమిది నెలల గర్భిణిని హత్య చేసిన భర్త విషయంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పట్టపగలు నిండు గర్భిణిని ఆమె నాలుగో భర్త హత్య చేశాడు. హజ్రత్ నిజూముద్దీన్ ప్రాంతంలో ఏప్రిల్ 27వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఆ హత్య జరిగింది. మృతురాలిని సైనాగా పోలీసులు గుర్తించారు. 

హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. 29 ఏళ్ల వయస్సు గల సైనా ఢిల్లీలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తుంది. డ్రగ్ క్వీన్ గా పేరున్న సైనా ఏడాది క్రితం వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు 

ఎనిమిది నెలల గర్భవతి కావడంతో సైనా బెయిల్ మీద జైలు నుంచి విడుదలైంది.  ఆమె మొదటి ఇద్దరు భర్తలు ఆమెను వదిలేసి బంగ్లాదేశ్ కు వెళ్లిపోయారు. ఢిల్లీ - ఎన్సీఆర్ లో డ్రగ్ లార్డ్ గా పేరు పొందిన షరాఫత్ షేక్ అనే మాదక ద్రవ్యాల వ్యాపారిని ఆమె మూడో వివాహం చేసుకుంది. 

గ్యాంగస్టర్, మాదకద్రవ్యాల వ్యాపారికి కావడంతో అతన్ని పోలీసులు ఎన్పీడీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకు సైనా అరెస్టయింది. దాంతో ఆమె సోదరి రెహానాతో వసీం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత తన సోదరితో వసీం అక్రమ సంబంధం గురించి సైనా తెలుసుకుంది. దాంతో వసీంతో సైనా తరుచుగా గొడవ పడుతూ ఉండేది. 

దాంతో సైనాను అడ్డు తొలగించుకోవాలని వసీం నిర్ణయించుకుని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తన వెంట రెండు పిస్టల్స్ తెచ్చుకున్నాడు. సైనా ఇంటికి వచ్చిన వెంటనే వసీమ్ ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దాంతో సైనా మరణించింది. ఆమె రక్షించడానికి ప్రయత్నించిన సర్వెంట్ మీద కూడా అతను కాల్పులు జరిపాడు. సర్వెంట్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు హత్య చేసిన తర్వాత వసీం తన వద్ద ఉన్న రెండు పిస్టల్స్ తీసుకుని వెళ్లి నిజాముద్దీన్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోయాడు.