Asianet News TeluguAsianet News Telugu

మహిళను విచక్షణా రహితంగా తన్నిన డీఎంకే నేత..అరెస్ట్

మహిళ అని కనికరం కూడా లేదు. మహిళపట్ల ఎలా ప్రవర్తించాలో మర్చిపోయాడు. అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి వీధి రౌడీలా ప్రవర్తించాడు. ఓ మహిళను పదేపదే తన్నుతూ మృగంలా ప్రవర్తించాడు. అడ్డు వచ్చిన మహిళలను సైతం పక్కకు నెట్టి మరీ తన్నుతూ కక్ష తీర్చుకున్నాడు. 

Former DMK corporator hits woman at beauty salon, arrested by police
Author
Chennai, First Published Sep 13, 2018, 7:11 PM IST

చెన్నై: మహిళ అని కనికరం కూడా లేదు. మహిళపట్ల ఎలా ప్రవర్తించాలో మర్చిపోయాడు. అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి వీధి రౌడీలా ప్రవర్తించాడు. ఓ మహిళను పదేపదే తన్నుతూ మృగంలా ప్రవర్తించాడు. అడ్డు వచ్చిన మహిళలను సైతం పక్కకు నెట్టి మరీ తన్నుతూ కక్ష తీర్చుకున్నాడు. 

సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. మహిళపై ఓ ప్రజాప్రతినిధి చేసిన వీరంగం వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతనిని కటకటాల వెనక్కినెట్టారు.  

వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని డీఎంకే మాజీ కార్పొరేటర్ సెల్వరాజ్ మహిళా బ్యూటీ పార్లర్ లోకి వెళ్లాడు. బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న సత్యలక్ష్మీ అనే మహిళతో గొడవకు దిగాడు. వెళ్లిపోవాలని ఆ మహిళ సర్ధిచెప్పినా పట్టించుకోలేదు. కోపంతో రగిలిపోయాడు. 

మహిళల బ్యూటీ పార్లర్‌కు మగవాళ్లు వెళ్లకూడదని తెలిసినప్పటికీ లోపలికి వెళ్లి వీధి రౌడీలా రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే సత్యలక్ష్మిని విచక్షణా రహితంగా తన్నాడు. సత్యలక్ష్మీతోపాటు పనిచేస్తున్న ముగ్గురు మహిళలు అడ్డుకున్నా ఆగకుండా తన్నుతూనే ఉన్నాడు. కోపం చల్లారాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
 
సెల్వరాజ్ మహిళా బ్యూటీపార్లర్ కు వెళ్లడం, గొడవ పెట్టుకోవడం, విచక్షణా రహితంగా తన్నడం ఈ వ్యవహారమంతా సీసీ టీవీలో రికార్డు అయ్యింది. దాన్ని ఆధారంగా చేసుకుని బాధితురాలు సత్యలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సత్యలక్ష్మి ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. 

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు దిగొచ్చారు. సెల్వరాజును అరెస్ట్ చేశారు. మరోవైపు సెల్వరాజు ప్రవర్తనపై డీఎంకే పార్టీ సీరియస్ అయ్యింది. అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు డీఎంకే  ప్రకటించింది.

అయితే సెల్వరాజ్ సత్యలక్ష్మీపై దాడికి పాల్పడటానికి ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సకాలంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతోనే సత్యలక్ష్మీపై సెల్వరాజ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios