థానే: మహారాష్ట్ర మాజీ బిజెపి ఎమ్మెల్యే నరేంద్ర మెహతా (48) అత్యాచారం కేసు నమోదైంది. అతనిపై రేప్ కేసు మాత్రమే కాకుండా అక్రమ వివాహం, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. గతంలో ఆయన థానేలోని మీరా - భయాందర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 

తనను మెహతా 2001 జూన్ 13వ తేదీన అక్రమంగా వివాహం చేసుకున్నారని స్థానిక బిజెపి మహిళా కార్పోరేటర్ ఆరోపించారు. తనతో ఓ కుమారుడిని కూడా కన్నాడని, అతని వయస్సు ఇప్పుడు 16 ఏళ్లు అని ఆమె చెప్పింది. మీరా రోడ్ పోలీసు స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ సందీప్ కదమ్ ఆ విషయాలు చెప్పారు.

1990 నుంచి 20 ఏళ్ల పాటు మెహతా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని ఆ మహిళ ఆరోపించినట్లు తెలిపారు. 2015లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనను బెదిరించాడని మెహతా అనుచరుడు సంజయ్ థర్తారేపై కూడా మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

మెహతా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అత్యంత సన్నిహితుడని, దాంతో కుమారుడితో పాటు దుబాయ్ లో స్థిరపడాలని తనకు సలహా ఇచ్చారని మహిళ ఆరోపించింది. నిందితులిద్దరు కూడా పరారీలో ఉన్నారు. 

ఆందుకు సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాంతో సోమవారంనాడు బిజెపికి మెహతా రాజీనామా చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మెహతా తనను వాడుకున్నాడని కూడా మహిళ ఆరోపించింది. మెహతాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శివసేన ఎమ్మెల్సీ డాక్టర్ నీలమ్ గోర్హే డిమాండ్ చేశారు.