భోపాల్: మూగ, చెవిటి వారి కోసం నడుస్తున్న భోపాల్ లోని వసతి గృహానికి సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. హాస్టల్ డైరెక్టర్ పై నాలుగో మహిళ ఫిర్యాదు చేసింది. తనను అక్రమంగా నర్బంధించి, ఆరు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. 

హాస్టల్ డైరెక్టర్ అశ్విని శర్మపై 19 ఏళ్ల దివ్యాంగురాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బాగోతం వెలుగు చూసింది. స్థానిక ఐటిఐలో కోర్టును పూర్తి చేయడానికి తాను హాస్టల్లో ఉన్నప్పుడు డైరెక్టర్ మూడేళ్ల పాటు తనపై అత్యాచార చేశాడని బాధితురాలు ఆరోపించింది. 

అశ్విని శర్మను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. హాస్టల్లో గతంలో ఉన్న ఇద్దరు బాలికలు కూడా అతనిపై గురువారంనాడు ఫిర్యాదు చేశారు. 2017లో హాస్టల్లో ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది. అప్పటికి ఇద్దరు బాలికల్లో ఒకామె మైనర్. 

తనను నిర్బంధించి, బలవంతంగా పోర్న్ సినిమాలు చూపించి, అసహజ శృంగారానికి పాల్పడ్డాడని, ఆరు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని నాలుగో బాధితురాలు డైరెక్టర్ పై ఫిర్యాదు చేసింది. అతని డిమాండ్లను అంగీకరించకపోవడంతో కొన్నిసార్లు తనను దారుణంగా కొట్టాడని కూడా చెప్పింది. 

నిందితుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అండదండలున్నాయని ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ ఆరోపించింది. నిందితుడి పక్కన శివరాజ్ చౌహాన్ నిలబడి ఉన్న వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెసు ముఖ్య అధికార ప్రతినిధి శోభా ఓజా విడుదల చేశారు.