అయోధ్యకు తొలి విమానం.. రాముడు, సీత, హనుమంతుడి వేషధారణలో ప్రయాణికులు.. వీడియో వైరల్
గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు మొట్ట మొదటి సారిగా ప్రయాణించిన విమానంలో (ahmedabad to ayodhya first flight) రాముడు, సీత ఇతర దేవతా వేషదారణలో భక్తులు (Passengers dressed as Rama, Sita and Hanuman) ఆకట్టుకున్నారు. దీంతో ఇతర ప్రయాణికులు వారితో ఫొటోలు తీసుకోవడంతో పాటు బహుమతులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral)గా మారింది.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమం దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో యావత్ దేశమంతా రామ నామమే వినిపిస్తోంది. ఆలయ ప్రారంభోత్సవం దగ్గరకు వస్తున్నా కొద్దీ.. భక్తుల్లో ఉత్సాహం పొంగి పొర్లుతోంది. భక్తి పారవశ్యంలో మునిగిపోతూ.. అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు ఇండిగో మొదటి విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలో విమానాశ్రయానికి చేరుకున్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో దేవతల వేషధారణలో ప్రయాణీకులు కనిపించడంతో అందరూ వారిని ఆసక్తిగా గమనించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి వేషధారణలో ఉన్నారు. ప్రయాణికులు విమానాశ్రయంలో సిబ్బందితో, ఆ తర్వాత ఇతరులతో ఫొటోలు దిగారు.
ప్రయాణికులు ఉత్సాహంగా ఎయిర్ పోర్టులో జై శ్రీరామ్ నినాదాలు చేశారు. రాముడి వేషధారణలో ఉన్న ఆ వ్యక్తికి విగ్రహాన్ని బహూకరించారు. వారితో ఇతర ప్రయాణికులు ఫొటోలు తీసుకున్నారు. కాగా.. న్యూఢిల్లీ నుంచి అయోధ్య-అహ్మదాబాద్ మధ్య నడిచే డైరెక్ట్ ఫ్లైట్ ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఇక నుంచి అయోధ్యకు అహ్మదాబాద్ నుంచి వారానికి మూడు డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రయాణిస్తాయి.
ఇదిలా ఉండగా.. జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయోధ్యలోని రామ్ లల్లా (బాల రాముడు) ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు వారం ముందు జనవరి 16 న ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ జరగనుంది.
అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 వేల మందికి పైగా ప్రముఖులు జరుకానున్నారు. 1008 హుండీ మహాయజ్ఞం నిర్వహించి వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. అయోధ్యలో భారీ ప్రతిష్ఠాపన కోసం వేలాది మంది భక్తులు వచ్చేందుకు వీలుగా పలు టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.