రైలులో కూతురిని మరచిపోయి.. ఊరంతా వెతికాడు

First Published 15, Jun 2018, 4:14 PM IST
Father forgets his daughter in Train
Highlights

రైలులో కూతురిని మరచిపోయి.. ఊరంతా వెతికాడు

ఎవరైనా రైళ్లలోనో.. బస్సులోనో లేదంటే మరో వాహనంలోనో ప్రయాణించి కొన్నిసార్లు వస్తువులను మరచిపోతుంటారు. అలాగే ఓ వ్యక్తి కూడా మరచిపోయాడు.. అయితే అలా మరచిపోయింది వస్తువును కాదు.. స్వయంగా తన కన్న కూతురిని... అదేంటి అల్లారు ముద్దుగా చూసుకునే కూతురిని ఎవరైనా మరచిపోతారా..?

మహారాష్ట్ర థానే జిల్లాలోని డాంబీవ్లికి చెందిన హరిపాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి షీర్డి వెళ్ళాడు.. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణం కోసం సాయినగర్-దాదర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కళ్యాణ్ సిటీకి చేరుకున్నాడు.. రైలు దిగిన తర్వాత భార్య, లగేజీతో సహా స్టేషన్ బయటకు చేరుకున్నాడు. అప్పుడు తన ఆరేళ్ల కూతురి సంగతి గుర్తుకు వచ్చింది.

కంగారు కంగారుగా తన బిడ్డ కోసం స్టేషన్ మొత్తం వెతికి చూశాడు. కానీ ఎక్కడా కూతురి ఆచూకీ దొరక్కపోవడంతో లోలోపల కుమిలిపోయాడు. అయితే ఆ సమయంలో  తన కూతురిని రైలు బోగిలో నిద్రపుచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగు పరుగున ఫ్లాట్ ఫాం మీదకు వెళ్లేసరికి.. అప్పటికే రైలు స్టేషన్ విడిచి దాదార్ వెళ్లిపోయింది. ఈ విషయాన్ని హరిపాల్ రైల్వే పోలీసులకు చెప్పడంతో.. వారు దాదర్‌లో ఉన్న పోలీసు సిబ్బంది సాయంతో పాపను గుర్తించి అతనికి అప్పగించారు. దీంతో హరిపాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

loader