డ్రగ్స్ కి బానిసగా మారి... అవి లేకుంటే బతకలేని స్థితికి వచ్చాడు ఓ వ్యక్తి. కాగా... అతనిని ఆ పిచ్చి నుంచి బయటపడేయాలని అతని తల్లిదండ్రులు గొలుసులతో కట్టేశారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్ పూర్ నగరంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఫిరోజ్ పూర్ కి చెందిన జస్బీర్ సింగ్(30) కి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంవత్సరం క్రితం అతనిని డ్రగ్స్ అలవాటు అయ్యాయి. అప్పటి నుంచి రోజూ వాటిని తీసుకోవడం మొదలుపెట్టాడు. చిరవకు డ్రగ్స్ కి పూర్తిగా బానిసగా మారిపోయాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామని ప్రయత్నించినా... డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేకపోతున్నాడు. దీంతో... తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు. కాగా... గమనించిన అతని కుటుంబసభ్యులు రక్షించారు.

దీంతో... జస్బీర్ సింగ్ ని ఈ డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడేయాలని అతని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. అందుకే కొడుకుని గొలుసులతో మంచానికి కట్టేశారు. ఈ విషయం తెలిసిన మీడియా జస్బీర్ సింగ్ ని కలిసి అసలు విషయం తెలుసుకుంది. తాను డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడేందుకే తన తల్లిదండ్రులు కట్టేసినట్లు చెప్పాడు.

కాగా... అదే గ్రామంలో జస్బీర్ లా డ్రగ్స్ కి బానిసలుగా మారిన వారు కనీసం 40మందికి పైనే ఉన్నారని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు స్పందించారు. డ్రగ్స్ ని అరిక్టట్టేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రగ్స్ అమ్మేవారు ఎవరో వారిని పట్టుకొని... వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హామీ ఇచ్చారు.