Asianet News TeluguAsianet News Telugu

‘‘ పోర్న్ వీడియోలు చూస్తున్నావా... ఫైన్ కట్టు ’’ : వెలుగులోకి కొత్త సైబర్ మోసం, రూ. లక్షల్లో టోకరా

ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు వీక్షిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దోపిడీకి తెరలేపారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు వెల్లడైంది.
 

Fake police notice for watching porn High tech extortion racket busted in delhi ksp
Author
New Delhi, First Published Jul 27, 2021, 5:01 PM IST

ఇటీవలి కాలంలో సైబర్, ఆన్ లైన్ మోసాలకు అంతులేకుండా పోతోంది. పోలీసుల నిఘా ఎక్కువ అవుతుండటం, ప్రజల్లోనూ కాస్త అవగాహన వస్తుండటంతో కేటుగాళ్లు రూట్ మార్చారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు వీక్షిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి తెరలేపారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 'ఆన్ లైన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నందుకు మీరు జరిమానా చెల్లించాల్సిందే'నంటూ ఈ ముఠా బాధితులకు నకిలీ నోటీసులు పంపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కాంబోడియా దేశంలోని ఓ వెబ్ అడ్రస్ ద్వారా ఈ నకిలీ నోటీసులు వస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఈ ముఠా సభ్యులు తొలుత ఆన్ లైన్ లో పోర్న్ చూసేవారిపై నిఘా పెడతారు. ఆపై వారి కంప్యూటర్లకు నకిలీ నోటీసులు పంపిస్తారు. వెబ్ సైట్లలో దర్శనమిచ్చే పాప్ అప్ విండోల రూపకల్పనలో ఉపయోగించే సాంకేతికత, యాడ్వేర్ టెక్నాలజీ ఉపయోగించి నకిలీ నోటీసులను పంపేవారు. పోర్న్ వీడియోలు చూస్తున్నందుకు గాను రూ.3 వేలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసేవారు. అప్పటివరకు వారి కంప్యూటర్లను పనిచేయనివ్వకుండా అడ్డుకునేవారు.

వీరి బాగోతంపై ఢిల్లీ పోలీసులు సుమోటోగా స్పందించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని పోస్టుల ఆధారంగా సైబర్ సెల్ రంగంలోకి దిగి నిందితులను గుర్తించింది. చెన్నైకి చెందిన గాబ్రియెల్ జేమ్స్, రామ్ కుమార్, తిరుచ్చికి చెందిన బి.దినుశాంత్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దినుశాంత్ సూత్రధారిగా గుర్తించారు. కాగా, పోర్న్ చూడని వారికి కూడా ఈ ముఠా నకిలీ నోటీసులు పంపేదని సైబర్ సెల్ అధికారులు పేర్కొన్నారు.

ఇక, పోలీసుల విచారణలో దినుశాంత్ ఆసక్తికర అంశం బయటపెట్టాడు. తన సోదరుడు బి.చంద్రకాంత్ కాంబోడియాలోని నామ్ ఫెన్ లో ఉంటూ ఈ నకిలీ దందా నిర్వహణలో తోడ్పాటు అందించేవాడని వెల్లడించారు. పోలీసులు నిందితులకు సంబంధించిన 20 బ్యాంకు ఖాతాలను నిలిపివేయించారు. నకిలీ నోటీసుల సాయంతో ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య కాలంలో దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు వెల్లడైంది

Follow Us:
Download App:
  • android
  • ios