న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా ప్రజలంతా సమర్థిస్తుంటే కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మాత్రం ఖండించారు. 

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని కార్తీ చిదంబరం తప్పుబట్టారు. రేప్ అనేది అతి క్రూరమైన చర్య అని అంగీకరించిన కార్తీ చిదంబరం నిందితులను చట్టానికి లోబడి శిక్షించాలని సూచించారు. 

ఎన్‌కౌంటర్ అనేది ప్రజాస్వామ్యానికి కళంకం అని ఆయన అభిప్రాయపడ్డారు. సత్వర న్యాయానికి సరైన మార్గం ఎన్ కౌంటర్ కాదంటూ తన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతేకాదు,  ఫేక్ ఎన్‌కౌంటర్ ప్రధానాంశంగా తెరకెక్కిన తమిళ చిత్రం విసారణై సినిమాను చూస్తే తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్ ఎలాంటిదో తెలుస్తుందని కార్తీ చిదంబరం అభిప్రాయపడ్డారు.  

 

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

Disha Accused Encounter: తెలంగాణ పోలీసులపై పొగడ్తలు , యూపీ పోలీసులకు మాయావతి చురకలు

తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు వైద్యులు. శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశంలోనే గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పంచనామా నిర్వహించారు. 

శవ పంచనామా అనంతరం నాలుగు మృతదేహాలను ఫరుక్‌ నగర్‌, పొందుర్గు, నందిగామ, చౌదరిగూడ తహాశీల్ధార్ లకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ఇకపోతే నిందితుల స్వగ్రామం అయిన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామంలో వనపర్తి ఎస్పీ అపూర్వారావు పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

దిశకు న్యాయం, పోలీసులను ఏమనకండి... ఢిల్లీ నిర్భయ తల్లి