దేశ రాజధాని ఢిల్లీలో దారుణం  చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడికి బలవంతంగా లైంగిక మార్పిడి చేశారు. అనంతరం.. ఆ బాలుడిపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. కాగా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మూడు సంవత్సరాల క్రితం ఓ డ్యాన్స్ కార్యక్రమంలో మైనర్ బాలుడికి కొందరు వ్యక్తులు పరిచయం అయ్యారు. బాలుడిపై కన్నేసిన సదరు వ్యక్తులు భారీ కుట్ర పన్నారు. డ్యాన్స్ నేర్పిస్తాం రమ్మంటూ మండవలి ప్రాంతానికి పిలిపించారు. అలా డ్యాన్స్ నేర్చుకోవడానికి బాలుడు వారి వద్దకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాలుడికి కొంత మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చేవారు. ఈ క్రమంలో డ్యాన్స్‌ను కొనసాగించమని, తద్వారా జీవనాధారం లభిస్తుందని బాలుడికి చెప్పారు. 

అనంతరం చిన్నగా బాలుడికి మత్తుపదార్థాలు ఇవ్వడం అలవాటు చేశారు. ఆ తర్వాత బలవంతంగా లింగ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆ బాలుడు కాస్త అమ్మాయిగా మారిపోయాడు. ఆ తర్వాత బాలుడిపై అత్యాచారానికి పాల్పడం మొదలుపెట్టారు. తర్వాత విటులను రప్పించి.. వ్యభిచారం కూడా చేయించడం మొదలుపెట్టారు.

తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపేస్తామని, కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెడతామని బాలుడిని నిందితులు బెదిరించారు. గతేడాది మార్చిలో వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు ఎట్టకేలకు తన తల్లిని కలిశాడు. అయితే, బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న నిందితులు ఇంటికొచ్చి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. 
ఆ తర్వాత కొన్ని రోజులకు బాధిత బాలుడు, అతడి స్నేహితుడు కలిసి తప్పించుకుని ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ రోజంతా దాక్కున్నారు. అక్కడ ఓ న్యాయవాది వారిని చూసి చేరదీసి ఢిల్లీ మహిళా కమిషన్ చెంతకు తీసుకెళ్లడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలురు ఇద్దరికీ పునరావాసం, రక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్టు మహిళా కమిషన్ తెలిపింది.