‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందజేస్తామని హామీ ఇచ్చి తీరా బుక్ చేసుకున్నాక... ఫోన్లు  ఇవ్వకుండా  మోసం చేశాడు.  అదే రింగింగ్ బెల్స్ సంస్థ  వ్యవస్థాపకుడు మోహిత్ గోయల్. ఇతనే ఇప్పుడు రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

ఈ స్మార్ట్ ఫోన్ విషయంలో తమకు చెల్లించవలసిన 16 లక్షలు చెల్లించకుండా ఫ్రాడ్‌కి పాల్పడ్డాడని ఘజియాబాద్ కు చెందిన ఆయమ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ గతంలో  మోహిత్ గోయల్ మీద కేసు పెట్టడంతో, గత ఏడాది మూడు నెలలపాటు అతను జైలు జీవితం గడపవలసి వచ్చింది. కొంతకాలం క్రితం అతను బెయిల్ మీద విడుదలయ్యాడు.

మళ్లీ అంతలోనే తాజాగా అతనితోపాటు మరికొందరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రేప్ కేసును సెటిల్‌మెంట్ చేస్తానని చెప్పి డబ్బు డిమాండ్ చేశాడన్న ఆరోపణపై అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016లో అట్టహాసంగా ప్రకటించబడిన Freedom 251 ప్రకటించబడిన రెండోరోజు పలు అనుమానాలకు తావిస్తూ, సర్వర్ క్రాష్ అయిందన్న సాకుతో ఆర్డర్లని స్వీకరించడం నిలిపివేసింది. కేవలం కొద్ది గంటల్లోనే 7.5 కోట్ల ఆర్డర్లు తమకు వచ్చాయని ప్రకటించిన మోహిత్ గోయల్ కేవలం 70వేల ఫోన్లను మాత్రమే డెలివరీ చేసాడు.